ఓటరు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చు.. ఎలా?

0
72

ఓటరు గుర్తింపు కార్డు లేకపోయినా ఓటు వేయొచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈనెల 11వ తేదీన జరుగనున్న ఏపీ అసెంబ్లీతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో మాదిరిగా ఓటర్ స్లిప్ ఉంటే సరిపోదు. ఓటర్ స్లిప్‌తో పాటు ఎన్నికల కమిషన్ సూచించిన 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని స్పష్టం చేసింది. లేకుంటే ఓటు వేయడానికి అనుమతించరని తెలిపింది.

ఈ నెల 11న తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభతో పాటు.. లోక్‍‌సభకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. గతంలో ఓటర్ స్లిప్ ఉంటే ఓటు వేయడానికి అనుమతి ఇచ్చేవారు. ఈ సారి ఓటర్ స్లిప్‌తో పాటు ఎన్నికల కమీషన్ గుర్తించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా చూపించాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఓటర్ ఐడీ కార్డు లేకపోతే ఏదో ఒక ఐడెంటిటీ కార్డ్ తప్పనిసరి. ఓటర్ ఐడీ కార్డు లేని వాళ్లు ఏఏ ఐడీ కార్డులు తీసుకెళ్లాలో తెలుసుకోండి.

ఎన్నికల కమిషన్ సిఫార్సు చేసిన 11 రకాల గుర్తింపు కార్డుల వివరాలను పరిశీలిస్తే, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వరంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీచేసిన ఉద్యోగుల ఫొటో గుర్తింపుకార్డు, బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోతోసహా జారీచేసిన పాస్ పుస్తకాలు, పాన్‌కార్డు, ఎన్పీఆర్ కింద ఆర్జీఐ జారీచేసిన స్మార్ట్‌కార్డు, కేంద్రం జారీచేసిన ఉపాధిహామీ పత్రం, ఆరోగ్య బీమా కింద కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ జారీచేసిన స్మార్ట్‌కార్డ్, ఫొటోజత చేసి ఉన్న పింఛన్ పత్రాలు, ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీచేసిన అధికారిక గుర్తింపు పత్రం, ఆధార్ కార్డు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించేవారికే ఓటు వేయడానికి పోలింగ్ అధికారి అనుమతిస్తారు. ఈ విషయాన్ని ఓటర్లు అందరూ గుర్తించాలని ఎన్నికల సంఘం కోరింది.