తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు సర్వం సిద్ధం… ఏపీలో బిగ్‌ఫైట్

0
38

తెలుగు రాష్ట్రాల్లో రేపటి పోలింగ్‌‌కు సర్వం సిద్ధమైంది. ఏపీ, తెలంగాణలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఈవీఎంలతో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముందుగానే ఓటింగ్ ముగియనుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉ.7 గం.లకు పోలింగ్.. ఆ ఒక్క చోట మాత్రం.. రేపటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 46,120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు అలాగే కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది.

మరోవైపు, తెలంగాణలోని 33 జిల్లాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 మంది ఎంపీల ఎన్నిక కోసం జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల 5 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 77 వేల 365 బ్యాలెట్‌ యూనిట్లు, 41 వేల కంట్రోల్‌ యూనిట్లు, 43,894 వీవీప్యాట్‌లను ఎన్నికల్లో వినియోగించనున్నారు.

మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 443 మంది అభ్యర్థులు నిలిచారు. నిజామాబాద్ నుంచి అత్యధికంగా 185 మంది బరిలో ఉండగా.. అత్యల్పంగా మెదక్‌ నుంచి 10 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికల కోసం మొత్తం 34,604 పోలింగ్ స్టేషన్లను రెడీ చేశారు. అయితే వీటిలో 6,445 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి.

తెలంగాణవ్యాప్తంగా ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుండగా.. నిజామాబాద్ లోక్ సభ పరిధిలో మాత్రం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటలనుంచి 8 గంటల వరకు అక్కడ మాక్ పోలింగ్ జరగనుంది. ఆ తర్వాతే సాధారణ పోలింగ్ మొదలు కానుంది.