తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్.. లైవ్ అప్ డేట్స్

0
72
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తెలంగాణలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భార్య పుష్ప కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారంలో ఓటేశారు. సూర్యాపేటలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి దంపతులు ఓటేశారు.మరో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లా ఎల్లపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ఓటేయగా సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిలు తమ ఓట హక్కును వినియోగించుకున్నారు.
ఇక ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. అయితే, సాంకేతిక సమస్యలతో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించగా.. మరికొన్ని చోట్ల పోలింగ్‌ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 7.40 గంటల కల్లా అందుతున్న సమాచారం ప్రకారం.. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం హుస్సేన్‌పురం పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.
అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం దొరసానిపాడు బూత్ నంబర్ 197లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు. ఇదే జిల్లాలోని చింతలపూడిలో 153 బూత్‌లో ఈవీఎం లు పనిచేయకపోవడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. జిల్లాలోని పాలకొల్లు మండలం వెలివెలి గ్రామంలోని 161వ పోలింగ్ బూత్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం పనిచేయడం లేదు.