ఈవీఎం చేయి తగిలి కిందపడిపోయింది… సమర్థించిన మధుసూదన్ గుప్తా

0
39

అనంతపురం జిల్లా గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎంను నేలకేసి కొట్టారని పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిలసింది. మధుసూదన్ తన ఓటు వేసేందుకు గుత్తి బాలికోన్నత పాఠశాలలోని 183వ నంబర్‌ పోలింగ్‌ బూత్‌కు వెళ్లారు. అక్కడి ఈవీఎం మొరాయించడంతో నేలకేసి కొట్టడం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై మధుసూదన్ గుప్తా స్పందిస్తూ, ఈవీఎం తన చేయి తగిలి కింద పడి పగిలిపోయిందని చెప్పారు. ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లానని, అక్కడ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎక్కడ ఓటు వేయాలన్న సూచనలు లేవని ఆరోపించారు.

గుంతకల్‌లో జనసేన తరపున అసెంబ్లీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని, తమ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థి ఎవరూ ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదని, ఇలాంటి సూచనలు లేకపోవడం వల్ల తాను నష్టపోతానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను ప్రశ్నిస్తే, వారు ఎటువంటి సమాధానం చెప్పలేదని, అదే సమయంలో తన చేయి తగిలి ఈవీఎం కిందపడి పగిలిపోయిందని సమర్థించుకున్నారు. కాగా, ఈవీఎంను మధుసూదన్ గుప్తా నేలకేసి కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.