ఏపీలో వెల్లువెత్తిన ఓటరు.. పోలింగ్ ఉద్రిక్తతం

0
55

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తత వాతావరణంలో నెలకొంది. పలుచోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. కళ్ల ఆయన చొక్కాను చింపేశారు. ఆయనకు అడ్డుగా నిలిచిన గన్ మెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు

ఈ ఘటనపై స్పీకర్ మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల్లో దౌర్జన్యం చోటుచేసుకుంటుందని చెప్పారు. వైకాపాకు చెందిన వారు చేసిన దాడులు చూస్తుంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. ఈ రౌడీరాజ్యం పాలనలోకి వస్తే ఇంకేమైనా వుందా అంటూ ప్రశ్నించారు. సరైన పద్ధతిలో ఓటు హక్కును వినియోగిస్తే గెలుపు సాధ్యం కాదనే.. దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు.

మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్త పుల్లారెడ్డిలు మరణించారు.