వైజాగ్‌లో క్రాస్ ఓటింగ్.. జనసేన అభ్యర్థి గెలుపు ఖాయమా?

0
52
VV Lakshmi Narayana
VV Lakshmi Narayana

నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖలో ఈసారి పాగా ఎవరిది? ఇక్కడి నుంచి లోక్‌సభకు వెళ్లే ప్రతినిధి ఎవరు? ఓటింగ్‌ ముగిశాక నగర వాసుల్లో జరుగుతున్న చర్చ ఇది. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షించిన నియోజకవర్గాల్లో గాజువాక అసెంబ్లీ స్థానం, విశాఖ పార్లమెంటరీ స్థానాలున్నాయి. గాజువాక నుంచి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడం, విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆ పార్టీ తరపున మాజీ ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ రంగంలో ఉండడమే ఇందుకు కారణం.

అయితే, ఇక్కడ గాజువాక స్థానం సంగతి పక్కన పెడితే, విశాఖ లోక్‌సభ స్థానం విషయంలో పార్టీలకతీతంగా ఓ అభ్యర్థి విషయంలో చర్చ నడిచింది. ఆయనే లక్ష్మీనారాయణ. చతుర్ముఖ పోటీ జరిగిన ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి తప్ప టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు ముగ్గురూ రాజకీయాలకు కొత్తవారే. కానీ జనసేన అభ్యర్థిగా రంగంలోకి దిగిన లక్ష్మీనారాయణ పార్టీ ఇమేజ్‌ కంటే తనదైన వ్యక్తిగత గుర్తింపుతో నగరవాసుల్ని ఎక్కువగా ఆకట్టుకున్నారు.

మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి, వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కేసుల విచారణ ప్రత్యేక అధికారిగా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా లభించిన విశేష ప్రాచుర్యమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఆ చరిష్మా లక్ష్మీనారాయణకు ఈ ఎన్నికల్లో బాగా కలిసివచ్చింది. వాస్తవానికి నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గాజువాక మినహా మిగిలిన చోట్ల జనసేన అభ్యర్థులు అంత బలమైన వారేమీ కాదు. యువతలో ఆ పార్టీ పట్ల ప్రత్యేక ఆకర్షణ ఉన్నప్పటికీ అది ఏ స్థాయి ఓటు బ్యాంక్‌ అన్నది ఖచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితి.

ఈ పరిస్థితుల్లో మాజీ జేడీ వ్యక్తిగత ఇమేజ్‌ కొంత అక్కరకు వచ్చిందని, నియోజకవర్గంలో నిన్న జరిగిన పోలింగ్‌లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని చెబుతున్నారు. స్థానికేతరుడన్న విమర్శ వచ్చినప్పటికీ తాను ఇక్కడే ఇల్లు తీసుకుని నివాసం ఉంటానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

అలాగే తాను ఏం చేయబోతున్నదీ బాండ్‌ పేపర్‌పై రాసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. మాట తప్పితే తనపై ఎవరైనా కేసు పెట్టవచ్చని నగరవాసులకు హామీ ఇచ్చారు. పైగా విద్యావంతుడు, నిజాయతీపరుడన్న పేరుండడం కొన్నివర్గాల వారిని విశేషంగా ఆకర్షించింది. దీంతో ఈ స్థానం నుంచి లక్ష్మీ నారాయణ గెలుపు ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.