ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభతో పాటు.. లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ శాతం 76.69 శాతంగా నమోదైంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గురువారం అర్థరాత్రి ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. సాయంత్రం వరకు 71.43 శాతమే పోలింగ్ నమోదైంది. గత 2014 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి కొంతమేర పోలింగ్ శాతం తగ్గిందని చెప్పొచ్చు.
దీనికి కారణాలు లేకపోలేదు. అనేక ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఈవీఎంలు మొరాయించడం, ఘర్షణలు చోటు చేసుకొన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాల్సిన ఆవశ్యకతపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
కాగా, ప్రకాశం, విజయనగరం జిల్లాలో అత్యధికంగా 85 శాతం పోలింగ్ నమోదుకాగా.. విశాఖ, పశ్చిమ గోదావరి, కడపలో అత్యల్పంగా 70శాతం నమోదైంది.
జిల్లాల వారీగా.. శ్రీకాకుళం: 72 శాతం, విజయనగరం 85 శాతం, విశాఖపట్నం 70 శాతం, తూర్పుగోదావరి 81 శాతం, పశ్చిమగోదావరి 70 శాతం, కృష్ణా 79 శాతం, గుంటూరు 80 శాతం, ప్రకాశం 85 శాతం, నెల్లూరు 75 శాతం, చిత్తూరు 79 శాతం, కర్నూలు 73 శాతం, వైఎస్సార్ కడప 70 శాతం, అనంతపురం 78 శాతం చొప్పున పోలింగ్ నమోదైంది.