ఉపాసన అమ్మ ఓటు గల్లంతు.. అధికారిపై సస్పండ్ వేటు

0
65

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అత్త, అపోలో హాస్పిటల్ గ్రూప్‌ ఎగ్జిక్యుటివ్‌ వైస్‌ఛైర్‌పర్సన్‌ శోభనా కామినేని ఓటు గల్లంతైంది. దీంతో ఓటర్ల జాబితా తయారు చేసిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.

ఈనెల 11వ తేదీన జరిగిన సార్వత్రిక తొలి దశ ఎన్నికల పోలింగ్‌లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆమె అమెరికా నుంచి స్వదేశానికి వచ్చింది. ఆమెకు ఓటు హైదరాబాద్‌లో ఉంది. ఈ ఓటు వేసేందుకు ఆమె పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, ఓటర్ల జాబితాలో ఆమె ఓటు లేదు.

దీంతో ఆగ్రహిచిన శోభనా కామినేని.. ఓ వీడియోతో తన ఆవేదనను వెల్లడించింది. ఈ వీడియోను ఆమె కుమార్తె, చెర్రీ భార్య ఉపాసన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఇది వైరలై.. పెద్ద వివాదమే సృష్టించింది.

తన ఓటు గల్లంతు కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఓటుకు విలువలేదా, విదేశాల నుంచి ఓటేయడానికి వస్తే ఇలా చేస్తారా అని ఆక్రోశిస్తున్నారు. తన తల్లికి విలువ ఇవ్వరా అంటూ ఆవిడ కూతురు ఉపాసన కూడా చెప్పుకొస్తున్నారు.

శోభన పలుకుబడి ఉన్న మనిషి కావడంతో ఓటు గల్లంతుపై జీహెచ్‌ఎంసీ అధికారులు ఠారెత్తిపోయి వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఓటు గల్లంతుకు నువ్వే బాధ్యుడివంటూ బూత్‌ లెవల్‌ అధికారి ఓం ప్రకాశ్‌ను హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి ఎం.దానకిశోర్‌ సస్పెండ్‌ చేశారు.

శోభనకు మెహదీపట్నం సర్కిల్‌లోని విజయనగర్‌ కాలనీ పోలింగ్‌ బూత్‌ నంబరు 49లో చట్టవిరుద్ధంగా రెండు ఓట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె ఓట్లలో ఒకదాన్ని తీసేయాలని ఓంప్రకాశ్‌కు ఆదేశాలందాయి. తర్వాత ఆ రెండు ఓట్లూ గల్లంతయ్యాయి. ఈ కేసులో అధికారిని సస్పెండ్ చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.