ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన పోలింగ్ శాతం.. టీడీపీ గెలుపు ఖాయమా?

0
53

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గింది. ఇది రాజకీయ పార్టీల్లో గుబులు రేపుతోంది. ఏపీలో గురువారం అర్థరాత్రి వరకు జరిగిన పోలింగ్ జరిగింది. ఈ సరళిని పరిశీలించిన అన్ని పార్టీలు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నాయి.

తగ్గిన పోలింగ్ ఎవరికి కలిసివస్తుంది.. ఎవరి పుట్టి మునుగుతుంది అనేదానిపై పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. తాము అమలుచేసిన సంక్షేమపథకాలతో లబ్ధిపొందినవారు అధికశాతం తమకు అనుకూలంగా ఓటువేశారని టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

అధికారపార్టీపై అసంతృప్తితో ఉన్న ప్రజల్లో పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని.. ఇది ప్రభుత్వ వ్యతిరేకఓటుగా ప్రతిపక్షానికి కలిసివస్తుందని వైసీపీ నేతలు అంచనావేస్తున్నారు. 2014తో పోలిస్తే ఇపుడు పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో ఏపీలోని 13 జిల్లాల్లో 77.96 శాతం పోలింగ్ నమోదైంది. ఇపుడు76.69 శాతం నమోదైంది. సాధారణంగా పోలింగ్ శాతం హెచ్చతగ్గులు గెలుపోటములను ప్రభావితం చేస్తాయని భావిస్తారు.

సాధారణంగా పోలింగ్‌ శాతం పెరిగినప్పుడు అధికార పార్టీ ఓడిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. ఉమ్మడి ఏపీ, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికలు, పోలింగ్‌ శాతం, గెలుపోటముల అంశాలను పరిగణనలోకి తీసుకుంటే పలు అంశాలు వెల్లడయ్యాయి.

మొత్తం ఎనిమిదిసార్లు పోలింగ్‌ శాతం పెరుగగా.. అధికారపార్టీ నాలుగుసార్లు ఓడిపోయి, మరో నాలుగుసార్లు విజయం సాధించింది. అయితే, 1983 టీడీపీ ఆవిర్భావం తర్వాత పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఐదుసార్లు పోలింగ్‌ శాతం పెరిగింది. నాలుగు సార్లు అధికారపార్టీ ఓటమి పాలైంది. 2009లో మాత్రమే పోలింగ్‌ శాతం పెరిగినా కాంగ్రెస్‌పార్టీ అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుంది. దీనికి కారణం వైఎస్.రాజశేఖర్ రెడ్డి హవా.

ఇక పోలింగ్‌శాతం తగ్గినప్పుడు మాత్రం అధికారపార్టీ ఎక్కువసార్లు గెలిచింది. ఇపుడు ఇదే సూత్రాన్ని టీడీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. ఐదుసార్లు పోలింగ్‌ శాతం తగ్గగా అధికారపార్టీ నాలుగుసార్లు గెలిచింది. ఒకసారి ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఏపీలో ఈసారి పోలింగ్‌ శాతం తగ్గడం ఏ పార్టీపై ప్రభావం చూపనున్నదోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొన్నది. ఫలితాలు మే 23న వెలువడుతాయి.