ఢిల్లీలో చంద్రబాబు వీధి నాటకాలు : కేటీఆర్

0
84

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయమని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈ ఓటమికి అవసరమైతే.. ట్రంప్‌, కేసీఆర్‌ కలిసి తనను ఓడించడానికి కుట్ర చేశారని బాబు అంటారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

ఏపీలో 130 సీట్లు గెలుస్తామంటున్న చంద్రబాబు.. ఢిల్లీలో వీధి నాటకాలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. మే 23 తర్వాత ఏపీలో ఏం జరగబోతుందో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. మోడీ పెంపుడు కుక్కలు కేసీఆర్‌, జగన్‌ అని చంద్రబాబు విమర్శించడాన్ని కేటీఆర్‌ తప్పుపట్టారు.

తామనుకుంటే అంతకన్నా ఎక్కువ మాట్లాడగలమని, కానీ.. సంస్కారం ఉండటం వల్లే అలా మాట్లాడట్లేదన్నారు. 2014లో ఈవీఎంలపై అనుమానాల్లేవా? టీడీపీ గెలిస్తే ఈవీఎంలు మంచివి.. ఓడితే చెడ్డవా? అని ప్రశ్నించారు.

ఇకపోతే, రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ మూడో స్థానంతో సరిపెట్టుకోనుందని, కొన్ని చోట్ల ఆ పార్టీకి డిపాజిట్లు దక్కే పరిస్థితి కూడా లేదని ఆయన జోస్యం చెప్పారు. నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ కేడర్‌ అంతా బీజేపీకి ఓటేయాలని ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో 10 స్థానాలు కాదు.. కాంగ్రెస్‌ మొత్తం దక్షిణాదిలో 10 స్థానాలు గెలిస్తే ఎక్కువని అన్నారు. కేరళలో రాహుల్‌ గాంధీ పోటీ చేసినంత మాత్రాన దక్షిణాదిపై ప్రభావం ఏమాత్రం ఉండబోదన్నారు.