ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపించింది. ఇందుకు కారణం ఈవీఎంలపై అధికారులు వ్యవహరించడమే. ఎవరెన్ని కుట్రలు చేసినా అధికారంలోకి రాబోయేది తమ ప్రభుత్వామేనని టీడీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఓటమి భయంతోనే టీడీపీ ఈవీఎంలపై రాద్ధాంతం చేస్తోందని బీజేపీ విరుచుకుపడింది.
ఈవీఎం లోపాలపై చర్చ విషయంలో ఎన్నికల కమిషన్ తీరు ఏకపక్షంగా ఉందని టీడీపీ ఎంపీ కనకమేడల ఆరోపించారు. తప్పు బయటపడిపోతుందని ఈసీ భయపడుతోందన్నారు. కేసులున్నాయన్న కారణంగా హరిప్రసాద్‌ను చర్చకు రావద్దనడం సరికాదని….. కేసులు ఉన్న వాళ్లే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కదా అని ప్రశ్నించారు.
చర్చకు తమ టెక్నికల్ టీమ్ తరపున హరిప్రసాద్‌ను అనుమతించాలని ఈసీకి లేఖ రాశారు. ఈవీఎంలలో ఉన్న లోపాలు దేశ ప్రజలందరికీ తెలియాలని.. లేదా.. ప్రజల ముందు ఎలక్షన్ కమిషన్ ముద్దాయిగా నిలబడాలని కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు తప్పుబడుతున్న చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు. అధికారులను బదిలీ చేస్తే బాబు ఎందుకు నానా యాగీ చేస్తున్నారన్నారు. టీడీపీకి పడని ఓట్ల గురించి చంద్రబాబు రచ్చ చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో మూడు కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని.. వారెవరికీ రాని అనుమానం బాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు నర్సింహారావు.
మరోవైపు ఏపీలో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అంటున్నారు. ఏపీ ప్రజలు టీడీపీ పక్షాన నిలబడ్డారని అన్నారు. మే 23న చంద్రబాబుకు ప్రజలు పట్టం కడుతారని జోస్యం చెప్పారు. ఈవీఎంల లోపాలపై చంద్రబాబు పోరాటం చేస్తుంటే.. ఓటమి భయం పట్టుకుందని విపక్షాలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు వెంకన్న.
ఇదంతా ఆ పార్టీల మైండ్ గేమ్‌లో భాగమన్నారు. ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడితే.. వైసీపీ నేతలు ఎన్నికల సంఘం బాగా పనిచేసిందని చెప్పడం దారుణమన్నారు. ఇంతకీ ఏ పార్టీ గెలుపును నమోదు చేసుకుంటే తెలియాలంటే.. వేచి చూడాలి.