ఏపీలో ఉత్కంఠ… కాయ్ రాజా కాయ్.. రూ.కోట్లలో బెట్టింగ్స్…

0
66

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నపాటి చెదురుముదురు సంఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల నిర్వహణా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇపుడు, ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.

సార్వత్రిక ఎన్నికల తొలి దశలోనే నవ్యాంధ్రలో 11వ తేదీన పోలింగ్‌ ముగియగా.. దేశవ్యాప్తంగా తుది విడత ఎన్నికలు మే 19వ తేదీన జరిగే చివరి దశ పోలింగ్‌తో ముగియనుంది. అంటే.. ఏపీ శాసనసభ ఎన్నికల ఫలితాల కోసం అప్పటివరకు వేచివుండాల్సి ఉంది. మే 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో అప్పటివరకు వేచి ఉండాల్సిన పరిస్థితి.

నవ్యాంధ్రలో పోలింగ్‌కు, ఫలితాలకు మధ్య 42 రోజుల వ్యవధి ఉండడంతో ప్రధాన పార్టీల అధ్యక్షులు, అభ్యర్థులకు గెలుపోటములపై ఆందోళన చెందుతున్నారు. ఫలితాల వచ్చే వరకూ ఆగడమెందుకు.. మన భవిష్యత్‌ మనమే తెలుసుకుందామని కొంత మంది అభ్యర్థులు వినూత్న ఆలోచన చేశారు.

సాధారణంగా ఎన్నికల ముందు కొన్ని పార్టీలు, అభ్యర్థులు ప్రీ-పోల్‌ సర్వే చేసుకుంటారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ‘మీ ఓటు ఎవరికి’ వేస్తారంటూ ప్రజలకు ఫోన్‌ చేసి వారి అభిప్రాయాలు తీసుకుని ఓ నిర్ణయానికి వస్తుంటారు.

ఈ ఎన్నికల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ప్రీ-పోల్‌ సర్వే చేయించుకుని బరిలోకి దిగారు. ఇప్పుడు పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ప్రధాన పార్టీల భవిష్యత్‌, అభ్యర్థుల విజయావకాశాలపై ఎవరూ ఒక అంచనాకు రాలేకపోగా.. ఏ పార్టీకి ఆ పార్టీ తమదే విజమమని ప్రకటించుకుంటున్నాయి.

దీంతో అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. విజయంపై ధీమా కోసం పోస్ట్‌ పోల్‌ సర్వేపై దృష్టి పెట్టారు. తమ తమ నియోజకవర్గాల ప్రజలకు ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. ‘మీ ఓటు ఎవరికి వేశారు’ అని తెలుసుకోగోరడంతో పాటు తమకు ప్రధాన పోటీ అనుకున్న అభ్యర్థుల పేర్లు కూడా ప్రస్తావిస్తూ సర్వే చేయించుకుంటున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. పార్టీలు కూడా ఇదే పద్ధతి ఎంచుకున్నాయి. ప్రజలకు ఫోన్‌చేసి.. అభ్యర్థుల పేర్లు ప్రస్తావించకుండా నేరుగా టీడీపీ, వైసీపీ, జనసేనల్లో దేనికి వేశారంటూ ఓటర్లను అడుగుతున్నారు.

ఇంకోవైపు.. బెట్టింగ్‌రాయుళ్లూ బరిలోకి దిగారు. కోట్ల డబ్బు పందేల్లో తగలబడి పోకుండా చూసుకోవడానికి వారి పోస్ట్‌పోల్‌ సర్వేకు ఉపక్రమించారు. దీనిద్వారా బెట్టింగ్‌ ధరను నిర్ణయిస్తున్నారు. ఇలా అభిప్రాయ సేకరణ ద్వారా గెలుపుపై స్పష్టత వస్తుందో లేదో తెలియదు గానీ.. ఫలితాలొచ్చేదాకా అభ్యర్థులకు, పార్టీలకు కాస్త ఊరటైతే దొరుకుతుంది.