టీడీపీ ఓడిపోవడం ఖాయం : జీవీఎల్ జోస్యం

0
112

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు జోస్యం చెప్పారు. ఆయన ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఈవీఎంలపై తాము వ్యాఖ్యలు చేసినప్పుడు వీవీప్యాట్స్ వ్యవస్థ లేదని, తమ లాంటి వాళ్లు చేసిన ప్రయత్నం వల్లే ఈ వ్యవస్థ వచ్చిందని గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని, వాళ్లందరూ వీవీప్యాట్స్ ద్వారా తాము వేసిన ఓటు చూసుకున్నారని అన్నారు. తాము ఒక పార్టీకి ఓటేస్తే, మరొక పార్టీకి పడిందని ఏ ఓటరూ ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవని, అంటే, మూడు కోట్ల మంది ఓటర్లకు రాని అనుమానం చంద్రబాబుకే ఎందుకు వస్తోందని ప్రశ్నించారు.

తన ఓటు నా పార్టీకే వెళ్లిందో లేదో అని అనుమాన పడుతున్నారని విమర్శించారు. తాను వేసిన ఓటును వీవీప్యాట్లో చూసుకోవడం చంద్రబాబుకు తెలియలేదా? లేక మానసిక వ్యథతో ఉన్న చంద్రబాబు ఈవీఎంలో వేరే బటన్ ఏదైనా నొక్కారేమో అంటూ సెటైర్లు విసిరారు. టీడీపీకి పడే ఓట్లే ఆ పార్టీకి పడ్డాయని, ఇతరుల ఓట్లు దొంగింలించాలని చూస్తే కుదరదని, ప్రతి ఓటు వీవీప్యాట్స్‌లో నమోదై ఉందని అన్నారు.