నన్ను అలా చేసినందుకు థ్యాంక్స్ : నటి సంగీత భావోద్వేగ ట్వీట్

0
95

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల‌లో న‌టించిన నటి సంగీత. ఈమె ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. త‌న‌ని ఇంటి నుంచి వెళ్ల‌మ‌ని సంగీత బలవంతం చేస్తోందంటూ ఆమె తల్లి భానుమ‌తి మ‌హిళా క‌మీష‌న్‌కి ఫిర్యాదు చేయ‌డంతో ఆమెపై ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు. దీంతో ఆమె త‌న త‌ల్లిని ఉద్దేశిస్తూ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టింది.

ప్రియ‌మైన అమ్మా, ఈ ప్రంప‌చంలోకి న‌న్ను తీసుకొచ్చినందుకు నీకు ధ‌న్య‌వాదాలు. 13 ఏళ్ళ వ‌య‌స్సులో నన్ను స్కూలుకి దూరం చేసి, ప‌ని చేయించినందుకు ధన్యవాదాలు. ఖాళీ చెక్కుల‌పై నాతో సంత‌కాలు చేయించినందుకు కృత‌జ్ఞ‌త‌లు.

మందు, డ్ర‌గ్స్‌కి బానిసై జీవితంలో ఏ రోజూ ప‌నికి వెళ్ళ‌ని నీ కుమారుల కోసం నన్ను దోపిడి చేసినందుకు ధ‌న్య‌వాద‌ములు. నేను పోరాడే వ‌ర‌కు నాకు పెళ్లి చేయ‌నందుకు ధ‌న్య‌వాదాలు. న‌న్ను, నా భ‌ర్త‌ని వేధిస్తూ మా ప్ర‌శాంత‌త‌ని దూరం చేసినందుకు థ్యాంక్స్. ఓ త‌ల్లి ఇలా ఉండ‌కూడ‌ద‌ని తెలియ‌జేసినందుకు ధ‌న్య‌వాదాలు. చివ‌రిగా నువ్వు చేసిన త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌కి థ్యాంక్స్.

నువ్వు తెలిసో తెలియ‌క‌నో నోరు లేని అమ్మాయిని పోరాడే మ‌హిళగా మార్చావు. ఈ విష‌యంలో నిన్ను ప్రేమిస్తుంటాను. ఏదో ఒక రోజు నీ ఈగోని ప‌క్క‌న పెట్టి న‌న్ను చూసి ఖచ్చితంగా గ‌ర్విస్తావు అంటూ సంగీత త‌న పోస్ట్‌లో రాసింది.

ప్ర‌స్తుతం త‌మిళ చిత్రాల‌లో న‌టిస్తున్న సంగీత ప‌దేళ్ళ క్రితం క్రిష్ అనే వ్య‌క్తితో ఏడ‌డుగులు వేసింది. వారికి 2012లో ఆడ‌బిడ్డ జ‌న్మించిన విష‌యం విదిత‌మే. సంగీత త‌ల్లి భానుమ‌తికి సంగీత‌తో పాటు ఇద్ద‌రు కొడుకులు ఉండ‌గా, ఇటీవ‌ల త‌న చిన్న కొడుకు మ‌ర‌ణించాడు.

కాగా, మామగారి నుంచి వారసత్వంగా తనకు సంక్రమించిన ఇంటి నుంచి కన్నకూతురే తనను గెంటేయాలని చూస్తోందని, వ‌య‌స్సు‌ మీదపడిన ఈ వయసులో తాను ఎక్కడికి వెళ్లగలనని సినీనటి సంగీత తల్లి భానుమతి ఆరోపించారు. కూతురి చర్యను వ్యతిరేకిస్తూ ఆమె మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

తనను ఇంటి నుంచి వెళ్లగొట్టేందుకు బెదిరిస్తోందంటూ తన ఫిర్యాదులో ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నై జిల్లా వసరవాక్కంలో భానుమతికి రెండు అంతస్తుల ఇల్లు ఉంది. కిందిభాగంలో భానుమతి నివసిస్తుండగా, పైభాగంలో సంగీత క్రిష్‌ దంపతులు ఉంటున్నారు.

మామగారి నుంచి భానుమతికి సంక్రమించిన ఈ ఇల్లు ప్రస్తుతం సంగీత పేరున ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని తనను ఇంటి నుంచి వెల్లగొట్టాలని సంగీత చూస్తోందన్నది భానుమతి ఆరోపణ. కొద్దిరోజుల క్రితం సంగీత తమ్ముడు మృతి చెందాడు. ఉన్న అన్న తల్లిని అడ్డుపెట్టుకుని ఇల్లు ఎక్కడ కాజేస్తాడో అన్న భయంతో సంగీత ఇలా చేస్తోందని భానుమతి ఆరోపిస్తోంది. ఫిర్యాదు స్వీకరించిన మహిళా కమిషన్‌ సంగీతకు నోటీసులు జారీ చేసింది. దీంతో మూడు రోజుల క్రితం సంగీత భర్తతో కలిసి కమిషన్‌ ప్రతినిధుల ఎదుట హాజరై వివరణ ఇచ్చారు.