నాన్నకు మద్దతుగా ప్రచారం చేయను : సోనాక్షి

0
70

తాను రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా అంటోంది. పైగా, తాను ఎన్నికల ప్రచారం చేస్తానని తన తండ్రి కోరుకోరని చెప్పారు. ఈమె తండ్రి శుత్రఘ్నసిన్హా కాంగ్రెస్‌ పార్టీ తరపున పాట్నా లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.

దీనిపై ఆమె స్పందిస్తూ, ‘నా పనుల్లో నేను తలమునకలై ఉన్నాను. నాన్న తరపున నేను ప్రచారం చేయను. నిజాయతీగా చెప్పాలంటే… నేను ప్రచారం చేయాలని నాన్న పార్టీవారు కోరుకోరు కూడా! నేను రాజకీయాలకు చెందిన వ్యక్తిని కానని వాళ్ళకు తెలుసు కదా!’ అని ఏమాత్రం తడుముకోకుండా సమాధానమిచ్చింది.

బీజేపీలో చాలా ఏళ్ళు ఉన్న ఆయన, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తండ్రి నిర్ణయాన్ని స్వాగతించిన సోనాక్షీ సిన్హా, పార్టీ మార్పు గురించి మాట్లాడుతూ ‘మనం సంతోషంగా లేనిచోట ఉండటంలో అర్థం లేదు. చివరకు, నాన్న తనకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. బీజేపీతో చాలా ఏళ్ళ అనుబంధాన్ని వదులుకుని, కాంగ్రెస్‌లో చేరడం అనేది భావోద్వేగభరిత నిర్ణయం. కాంగ్రెస్‌ నేతగా, ఇంతకు ముందు మంచి పనులు చేసినట్టు ఇప్పుడూ చేస్తారని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.