ప్రస్తుతం దేశ నాయకులు, క్రీడాకారులు, నటీనటుల బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిల్లో కొన్ని విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి కూడా. ఈ నేపథ్యంలో జయలలిత పేరుతో ఇప్పటికే మూడు నాలుగు బయోపిక్ చిత్రాలు రూపొందుకోనున్నాయి. తాజాగా కోలీవుడ్ దర్శకుడు విజయ్ రూపొందిస్తున్న చిత్రంలో బాలీవుడ్ నటి కంగనాను జయ పాత్రకు ఎంచుకున్నారు. ఇందుకోసం ఆమె జీరో సైజ్ నుంచి భారీ సైజుకు మారనుంది.
కోలీవుడ్ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో తమిళ, తెలుగు, హిందీ త్రిభాషా చిత్రంగా స్వర్గీయ నటి, ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ రూపొందించనున్న విషయం తెలిసిందే. దేశ రాజకీయాల్లో ధీర వనితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మహిళ జయలలిత. ఆమె మృతితో తమిళ రాజకీయాల్లో తీవ్ర సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే.
కంగనాకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉన్నందునే ఆమెను ఈ పాత్రకు ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. జయలలిత సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు బొద్దుగా వుండేవారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యే సమయంలో ఆమె శరీరం భారీగా మారింది. థైరాయిడ్ కారణంగా ఆమె అలా మారారు.
ఎప్పుడూ జీరో సైజ్లో కనిపించే కంగనా ఇప్పుడు జయలా మారెందుకు కసరత్తులు చేస్తోంది. చిత్రంలో కొంత భాగం బొద్దుగా, మిగత భాగం భారీ శరీరంతో కనిపించనుంది. త్వరలోనే చిత్ర షూటింగ్లో పాల్గొననున్న ఆమె జయలలిత పాత్రలో ఎలా ఒదుగుతుందో వేచి చూడాల్సిందే.