ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తలపడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ వారాణసిలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
అలా అయితే రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నట్లుగానే నరేంద్ర మోడీ కూడా రెండో స్థానంలో పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రియాంకను వారాణసి నుంచి బరిలో దించితే ఆ ప్రభావం ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇప్పటికే సూచించారు. అయితే దీనిపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీదే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నరేంద్ర మోడీపై ప్రియాంక పోటీ చేసి గెలిచినా ఓడినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొనే అవకాశం ఉందని భావిస్తున్నాయి. అంతేకాదు.. ఇలా చేయడం ద్వారా మోడీ దేశవ్యాప్తంగా ప్రచారం చేయకుండా అడ్డుకోవచ్చనే ఆలోచన చేస్తున్నాయి.
కాగా, ఈనెల 26న వారాణసీ లోక్‌సభ స్థానానికి మోడీ నామినేషన్ వేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 25, 26 తేదీల్లో మోడీ సొంత నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగానే నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. అలాగే, ఇదే తేదీల్లోనే ప్రియాంకా కూడా నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.