ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్న రాజకీయ నాయకులపై చర్యలను తీసుకోవడానికి తమ దగ్గర తగినన్ని అధికారాల్లేవంటూ మెతక వైఖరి అవలంబిస్తున్న ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. విద్వేష ప్రసంగాలను చేస్తున్న నేతలపై కఠిన చర్యలు తీసుకొనే చట్టబద్ధమైన అధికారాలు నిజంగా ఎన్నికల సంఘానికి లేవా? అనే అంశాన్ని తాను పరిశీలించదలచుకున్నట్లు ప్రకటించింది.
ఈ మందలింపుతో ఎన్నికల సంఘం అధికారులు నిద్రమత్తును వీడారు. ఫలితంగా ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేతలపై కొరఢా ఝుళిపించింది. ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కొన్ని గంటల పాటు ప్రచారం చేయొద్దంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలను ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించింది.
తాజాగా, మరో ఇద్దరు నేతలకు కూడా ఈసీ నుంచి నిషేధపు ఆదేశాలు అందాయి. కేంద్ర మంత్రి, బీజేపీ నేత మేనకా గాంధీ 48 గంటలు, సమాజ్ వాదీ పార్టీ నేత ఆజంఖాన్ 72 గంటల పాటు ప్రచారంలో పాల్గొనేందుకు వీలులేదని ఆ ఆదేశాల్లో ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.