చంద్రబాబు మానసిక స్థితితి బాగోలేదు : విజయసాయి రెడ్డి

0
56

రాష్ట్రంలో మూడు కోట్ల తొంభై లక్షల మంది ఓటర్లు ఉన్నారని, ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఇంచుమించుగా 80 శాతం ఓటింగ్ జరిగిందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)ని విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీ నేతల బృందం సోమవారం కలిసి టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసింది. వైకాపా నేతలు, కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తోందంటూ అందులో పేర్కొంది.

ఆ తర్వాత విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ 130 స్థానాలు గెలుస్తుందని చెబుతున్న చంద్రబాబు, పోలింగ్ జరిగిన రోజున 30 శాతం ఈవీఎంలు పని చేయలేదని, 30 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఒక్కోరోజు ఒక్కో రకంగా వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబును నమ్మే పరిస్థితి ఈరోజున ఏపీలో లేదని వ్యాఖ్యానించారు. పోలింగ్ జరిగిన రోజు ఉదయం తన కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసేందుకు వెళ్లిన చంద్రబాబుకు వీవీప్యాట్స్ పని చేయలేదన్న విషయం అప్పుడు తెలియలేదా? అని ప్రశ్నించారు.

ఏపీ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు ఉదయం కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయని, వాటిని సరిచేసి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కొన్ని చోట్ల రెండు గంటలు, మరికొన్ని చోట్ల మూడు గంటల సమయం పట్టిందని అన్నారు.

ఈవీఎంలు మొరాయించడంతో వెనుదిరిగిన ఓటర్లు, అవి పనిచేస్తున్న విషయం తెలుసుకుని ఓటు వేసేందుకు వచ్చారని, రాష్ట్రంలోని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని అన్నారు. కృష్ణా జిల్లాలో ఈవీఎంలను ఉంచిన స్ట్రాంగ్ రూమ్‌లోకి అధికారులు ప్రవేశించి, వాటిని బయటకు తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.