ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ, తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. దీనికి కారణం పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోవడమే. దీంతో పోస్ట్ పోల్ సర్వే చేపట్టారు.
ఇందులోభాగంగా, ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ఓ సరికొత్త సర్వే జరుగుతోంది! అదేంటంటే.. ఏపీ ప్రజలతో పాటు ఏపీలో ఓట్లు వేసిన పలువురు హైదరాబాదీలకు ఫోన్లు చేసి ‘మీరే పార్టీకి ఓటేశారు?’ అని అడుగుతున్నారు. ఎవరు చేస్తున్నారో తెలీదు కానీ.. ఈ ఫోన్ కాల్స్ మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఫలితం తెలియడానికి మరో 40 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ సర్వే తెరపైకి వచ్చింది. ఈ నెల 11న పోలింగ్ ముగియగా.. రెండు రోజుల తర్వాత నుంచి ఏపీకి చెందిన లక్షలాది మందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.
‘మీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఓటు వేశారు? వైసీపీకి ఓటేస్తే 1 నొక్కండి.. టీడీపీకి వేస్తే 2. కాంగ్రెస్‌కు వేస్తే 3. జనసేనకు వేస్తే 4. బీజేపీకి అయితే 5. ఇతరులకు ఓటేస్తే 6 నొక్కండి’ అంటూ రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపిస్తోంది. ఫోన్ కాల్ అందుకున్న వారు.. తాము ఎవరికి ఓటు వేశామో తెలిపే నంబరు నొక్కిన వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికి ఓటేశారో అడుగుతోంది. దానికి సమాధానం చెప్పగానే కాల్ కట్ అవుతోంది. ఒకవేళ ఎవరైనా ఫోన్ ఎత్తకపోయినా, ఎత్తి సమాధానం చెప్పకున్నా.. కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఫోన్ రావడం గమనార్హం.
అదే పనిగా ఫోన్లు వస్తుండడంతో మొదట సమాధానం చెప్పనివారు కూడా చెప్పేస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో అంచనాలు అందుతున్నా.. వాటిలో వాస్తవం ఎంతన్న విషయాన్ని తనిఖీ చేసుకునేందుకే ఈ తరహా సర్వే చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. అయితే ఈ సర్వేను ఏ పార్టీ చేయిస్తుందన్నది తెలియడం లేదు. పోలింగ్ సర్వే ఫోన్ కాల్స్‌కు కొందరు సానుకూలంగా స్పందించగా.. మరికొందరు మాత్రం రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఎందుకు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
కొందరు సర్వే నిపుణులతో ఈ ఫోన్ కాల్స్ గురించి మాట్లాడితే.. మొత్తంగా ప్రజల ట్రెండ్ ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకోవచ్చని చెబుతున్నారు. కాగా, ఈ సర్వే ఎవరు చేస్తున్నారన్నది అంతుచిక్కడం లేదు. పార్టీల తరఫున ఏదైనా సంస్థ చేస్తున్నదా? లేక ఇతరులా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా ప్రధాన పార్టీలు ఈ సర్వేను చేయించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని హైదరాబాద్‌కు చెందిన ఒక ఐటీ సంస్థ యజమాని అన్నారు.