చెన్నైలో మోదీని ఎండగట్టిన బాబు.. వారణాసికి కూడా వెళ్తారట..?

0
64

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నై వేదికగా విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలతో కలిసి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాఫెల్ కుంభకోణంలో తప్పుడు అఫిడవిట్ ఇచ్చినవారు దేనికైనా తెగిస్తారని విమర్శించారు. డీఎంకేకు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు కేంద్రంలో మోదీకి ప్రధాని పగ్గాలు పట్టే అవకాశాన్ని ప్రజలు ఇవ్వకూడదన్నారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను పరిరక్షించాలని, అందుకోసం చాలా రోజులుగా పోరాడుతున్నానని అన్నారు. 50 శాతం వీవీప్యాట్స్ స్లిప్పులు లెక్కించాల్సిందేనని, ఈ విషయమై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. చాలా దేశాల్లో బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

ఇదిలా ఫంటే.. ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారా? దీనికి సమాధానంగా అవుననే సమాధానం ఇచ్చారు… టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. మోదీ పోటీ చేస్తున్న వారణాసికి కూడా చంద్రబాబు వెళతారని… ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తారని చెప్పారు. మోదీ ద్రోహాన్ని, కుయుక్తులను వారణాసి వేదికగా ఎండగడతారని అన్నారు.

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23వ తేదీన టీడీపీ ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు తెగిపోతాయని బుద్ధా వెంకన్న అన్నారు. 23న వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు. ఈసీ మద్దతుతోనే వైసీపీ అరాచకాలకు తెగబడిందని అన్నారు. అరాచకాలకు పాల్పడిన వైసీపీకే మోదీ నియమించిన గవర్నర్ కూడా అపాయింట్‌మెంట్ ఇస్తారని విమర్శించారు.