ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఈనెల 11వ తేదీన పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ తర్వాత వైకాపా నేతలు మాత్రం తామే అధికారంలోకి వస్తున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేనా.. వారు అనుసరిస్తున్న వ్యూహంతో రాష్ట్ర ప్రజలతో పాటు.. అధికారులు బిత్తరపోతున్నారు.
కొంతమంది అధికారులకు ఫోన్ చేసి రాబోతుంది మేమే.. చెప్పింది చేయ్యండంటూ జారీ చేస్తోన్న హుకుంలతోపాటు కేబినెట్ కూర్పుపై కూడా జరుగుతున్న ఊహాగానాలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు కూడా ఫోన్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని చేస్తోన్న హెచ్చరికలు, చేబుతున్నసూచనలు ఇప్పుడు ఆసక్తిగా మారింది.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశలోనే ఏపీ అసెంబ్లీకి కూడా పోలింగ్ నిర్వహించారు. హోరాహోరీగా జరిగిన ప్రచారం, పోలింగ్ రోజు ఈవీఎంల్లో సాంకేతిక లోపాలు, అయినా లెక్కచేయని ఓటర్లు. అర్థరాత్రి దాటేవరకు పోలింగ్ బూత్‌లలో ఉండి ఓటు హక్కు వినియోగించుకోవటం వంటి అంశాలు ఒకవైపు కళ్ల ముందు కనిపించాయి. ఈ దృశ్యాలను ఓటు వేసిన వారెవరూ, టీవీల్లో వీక్షించిన ప్రజానీకం కూడా మర్చిపోలేరు. యుద్ధంలో పోరాడే వారికి విజయం తమదేనన్న విశ్వాసం లేకపోతే చివరి వరకు పోరాడలేరు. ఆ విశ్వాసమే వారిని ముందుకు నడిపిస్తోంది. గెలుపు వరకు తీసుకెళ్తుంది. కానీ యుద్ధం ముగిసిన తర్వాత కూడా గెలుపుపై వైసీపీ నేతల వ్యక్తం చేస్తోన్న ధీమా, వారి మాటలు, చేతలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమయ్యాయి.
నిజానికి ప్రజలను గంటల తరబడి పోలింగ్ బూత్ ల వద్ద క్యూ లైన్లలో నిలబెట్టడమే కాకుండా సాంకేతిక సమస్యలు వచ్చిన ఈవీఎంలను సరిదిద్దకుండా మరుసటిరోజు ఉదయం వరకు పోలింగ్ నిర్వహించిన ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు జాతీయ స్థాయిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల కమిషన్ వైఫల్యాలను ఎండగట్టారు. దీంతో చంద్రబాబు ఓడిపోతున్నారని, ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ కొత్త పల్లవి అందుకుంది.
అంతేనా, వైసీపీ నేతలు రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు ఫోన్ చేయటం ప్రారంభించారు. ముఖ్యంగా పోలీస్ అధికారులకు, జిల్లాస్థాయిలో ఉన్న ఎస్పీలకు ఫోన్ చేసి ఇటీవల జరిగిన గొడవలు, అందులో వైసీపీ నేతలను అరెస్ట్ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి రాబోతుంది తామేనంటూ సాక్షాత్తు కొంతమంది జిల్లా ఎస్పీలకు ఫోన్ చేసి బెదిరించినట్టు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. పోలీస్ అధికారులు మాత్రం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నామని, నిష్పక్షపాతంగా వ్యవహారిస్తామని స్పష్టం చేస్తున్నారు.
మరోవైపు వైసీపీ నేతలు కేబినెట్ ఊహాగానాల్లో కూడా ఉన్నారు. ఎవరెవరికి మంత్రి పదువులు వస్తాయనే అంశంపై వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారు చర్చించుకుంటున్నారు. ఎవరికి మంత్రి పదవి వస్తుందో..?, ఆయా జిల్లాల్లో కులాల వారీగా ఇక్వెషన్లు గురించి కూడా చర్చించుకుంటున్నారు. మొత్తంమీద వైకాపా నేతలు అనుసరిస్తున్న వ్యూహాలం, పడుతున్న ఆరాటం చూస్తే దోచుకునేందుకు అర్రులు చాస్తున్నట్టుగా ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగానే వైకాపా అధికారంలోకి వస్తే… ఆకాశం కూడా ఆక్రమణలకు గురికావడం తథ్యమని వారు ఆరోపిస్తున్నారు.