ముంబై మహానగరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఏటీఎఫ్ చీఫ్ హేమంత్ కర్కరే మరణంపై భోపాల్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే ఆయన చనిపోయారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ‘2008 నాటి మాలేగావ్ పేలుళ్ల కేసులో తనపై అక్రమ కేసులు పెట్టి, మనోవ్యథకు గురిచేశారని.. ఆయన వంశం మొత్తం నాశనమవుతుందని ఆనాడే హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు. అన్నట్టుగానే 2008లో ముంబైలో జరిగిన తీవ్రవాదుల దాడిలో ఆయన చనిపోయారని’ అని ఆమె వ్యాఖ్యానించారు.
మాలేగావ్ పేలుళ్లలో ఆరుగురు మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లతో సాధ్వీ ప్రగ్యా సింగ్‌కు సంబంధముందని హేమంత్ కర్కరే తన దర్యాప్తులో తేల్చారు. దీంతో ఆమె జైలు పాలయ్యారు. అయితే 2016 మేలో ఆమెకు జాతీయ దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె బెయిల్ తీసుకున్నారు. భోపాల్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీకి సిద్ధమవుతున్న ఆమె.. ఏప్రిల్ 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు.