తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్ననటుడుగా గుర్తింపు పొంది.. ఆ తర్వాత బడా నిర్మాతల్లో ఒకరిగా ఎదిగిన నటుడు బండ్ల గణేశ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో గబ్బర్ సింగ్ చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత పలు చిత్రాలు నిర్మించి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరిగా మారిపోయాడు. ఈ క్రమంలో కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటోన్న ఆయన, మళ్లీ నటుడిగా తెరపై కనిపించనున్నాడని తెలుస్తోంది.
మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పైనే ఆయన కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాలో హాస్యాన్ని పండించే ఒక పాత్రను బండ్ల గణేశ్‌తో చేయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయనను సంప్రదించాడట. ఆ పాత్ర నచ్చడంతో వెంటనే బండ్ల గణేశ్ అంగీకరించాడని అంటున్నారు.
కామెడీ ఎపిసోడ్స్‌ను తనదైన శైలిలో డిజైన్ చేయడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. బండ్ల గణేశ్ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు కడుపుబ్బ నవ్విస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బండ్ల గణేశ్ ఇక నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి. ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం తెల్సిందే.