కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. అక్కడ మెజారిటీ జనాభా హిందువులే. గ్రామీణ, పట్టణ, తీర ప్రాంతాల్లో ఈ నియోజకవర్గం విస్తరించి ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్‌కు ముచ్చెమటలు పట్టించిన బీజేపీ.. ఎల్‌డీఎఫ్‌ను మూడో స్థానానికి పరిమితం చేసింది.
ఈసారి ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో మిజోరం మాజీ గవర్నర్, ప్రముఖ బీజేపీ నాయకుడు కుమ్మనం రాజశేఖర్‌ను రంగంలోకి దించింది. క్లీన్ ఇమేజ్, ప్రజలతో సత్సంబంధాలు, వివిధ సామాజికవర్గ నేతలతో ఉన్న పరిచయాలు, ఆరెస్సెస్‌తో మంచి అనుబంధం రాజశేఖరన్‌కు ఉంది. ఇది ఆయనకు లాభిస్తుంది భావిస్తోంది.
మరోవైపు, శబరిమల వివాదంతో కమలనాథులకు కలిసివచ్చేలా ఉంది. ఇంకోవైపు, సీఎం పినరయి విజయన్ సారథ్యంలోని అధికార ఎల్‌డీఎఫ్ కూటమిపై తీవ్ర వ్యతిరేకత. ఇవన్నీ కమలనాథులకు అనుకూలంగా మారే అవకాశం ఉందంటున్నారు.
ఇదిలావుంటే, కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ శశిథరూర్ వరుసగా రెండుసార్లు ఇక్కడినుంచే విజయం సాధించారు. ప్రస్తుతం మూడోసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో సొంత పార్టీ నాయకులే ఆయనకు దూరంగా ఉంటున్నారు. మొత్తం మీద ఆయనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌డీఎఫ్ కూటమి అభ్యర్థి దివాకరన్‌కు స్థానికంగా మంచి పట్టుంది.
కార్మిక నాయకుడు కావడం వామపక్షాలకు కలిసి వచ్చే అంశం ఉంది. వరదలతో అతలాకుతలమైన కేరళలో చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని ఆయన భావిస్తున్నారు.
ఈ స్థానంలో పార్టీల బలాబలాలే కాకుండా.. వివిధ సామాజిక వర్గాలు కూడా విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. నియోజకవర్గ పరిధిలో ఉన్న మెజారిటీ హిందువులు కీలకం కానున్నారు. ముఖ్యంగా నాయర్ సామాజిక వర్గం బీజేపీకి అనుకూలంగా ఉంది. శబరిమల వివాదంలో భక్తుల నమ్మకాలను ఎవరైతే గౌరవిస్తారో వారికే మద్దతిస్తామని నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్‌ఎస్ఎస్) ఇప్పటికే ప్రకటించింది. దీంతో తిరువనంతపురంలో గట్టిపోటీ నెలకొంది.