సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా, ముంబై దక్షిణం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవ్‌రాకు పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ఆయన తమ్ముడు అనిల్ అంబానీకి రాఫెల్ ఒప్పందంలో భాగంగా రూ.వేల కోట్ల ప్రయోజనం కలిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సమయంలో ముఖేశ్ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. కోటక్ మహీంద్రా బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ సైతం మిలింద్ గెలువాలని ఆకాంక్షించారు. ఈ నియోజకవర్గంలో ఈ నెల 29న పోలింగ్ జరగనుంది.
మిలింద్ దేవ్‌రా గురువారం తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ సౌత్ ముంబైలో పోటీకి మిలింద్ సరైన వ్యక్తి. ఆయన పదేండ్లపాటు నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నారు. ఆయనకు ఇక్కడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, పర్యావరణ స్థితిగతులపై, సమస్యలపై లోతైన అవగాహన ఉన్నది అని పేర్కొన్నారు.
ఉదయ్ కోటక్ మాట్లాడుతూ ముంబై ప్రజల కోసం మిలింద్ చాలా నిజాయితీగా కష్టపడుతారు. ఆయన కుటుంబం చాలా ఏండ్లుగా ముంబైతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉంది. ముంబై ఆకాంక్షలకు ఆయన ప్రతిరూపం అని తెలిపారు. పలువురు చిరువ్యాపారులు, వర్తక సంఘాలు, ఇతరులు కూడా మిలింద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆ వీడియోలో ఉన్నది.
ఈ సందర్భంగా మిలింద్ మాట్లాడుతూ.. ఇద్దరు వ్యాపార దిగ్గజాలు తనకు మద్దతు ప్రకటించడం చాలా సంతోషంగా ఉన్నదని చెప్పారు. చిరువ్యాపారులు, పాన్‌వాలాలు.. ఇలా అన్ని వర్గాలవారు తనకు మద్దతు పలుకుతున్నారని, ఇది చాలా గర్వంగా ఉన్నదన్నారు. గత ఐదేండ్లలో ముంబై సౌత్ ప్రాంతంలోని ప్రజలు, వ్యాపారులు పార్లమెంట్‌లో గొంతును కోల్పోయారని, ఈసారి అందరి ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని చెప్పారు. 2014 ఎన్నికల్లో మిలింద్ దేవ్‌రాపై శివసేన అభ్యర్థి అరవింద్ సావంత్ గెలుపొందిన విషయం తెల్సిందే.