ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాజమండ్రి సభలో హాస్య నటుడు అలీ తీరును గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వీటికి అలీ కౌంటర్ ఇచ్చారు. ఇందుకోసం ఓ వీడియోను కూడా రిలీజ్ చేశాడు.
ఈ ఇద్దరి గొడవ గురించి కొన్ని రోజుల క్రితం తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ, ఇద్దరూ చాలా మంచివాళ్లే .. కాకపోతే తొందరపడకుండా ఉండాల్సింది అన్నారు. తన తీరుపై వచ్చిన స్పందన గురించి తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “పవన్ .. అలీ గొడవ విషయంలో నేను వ్యక్తం చేసిన అభిప్రాయాలను నా సొంత మనుషులే తప్పుబడుతున్నారు. ఎవరో ఒకరివైపు నుంచి కాకుండా ఇద్దరి వైపు నిలబడి మాట్లాడటమేంటని అడుగుతున్నారు.
ఎందుకు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పవన్‌తోను.. అలీతోను ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించవచ్చుగదా అని అన్నారు. ఎన్నికల పనుల కారణంగా వాళ్లు అందుబాటులో ఉండరని నేను అలా చేయలేదు. ఎవరూ పూర్తి మంచివాళ్లు.. ఎవరూ పూర్తి చెడ్డవాళ్లు వుండరు. అందువల్లనే ఏ ఒక్కరివైపో వుండాలని నేను ఎప్పుడూ అనుకోను. అందుకే ఈ విషయంలోను ఇద్దరి వైపున మాట్లాడాను. అది కొంతమందికి గోడమీద పిల్లివాటంగా అనిపిస్తే నేను చేసేదేం లేదు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.