నరేంద్ర మోడీ పచ్చి మోసకారి.. : విరుచుకుపడిన చంద్రబాబు

0
44

ప్రధాని నరేంద్ర మోడీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు విరుచుకుపడ్డారు. మోడీ పచ్చి మోసకారి అంటూ ఆరోపించారు. అన్ని హామీలే ఇస్తారు.. ఒక్కటంటే ఒక్కటీ పూర్తి చేయరంటూ మండిపడ్డారు. కర్ణాటకలోని రాయచూర్‌లో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి కోసం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమరావతికి ఆర్థిక సాయం చేయకుండా దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అన్నీ హామీలే ఇస్తారు తప్ప చేతల్లో ఏమీ చేయరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపైనే పెడతామని సోనియా తెలిపారని, విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.

“మోడీ తీసుకున్న ఏ నిర్ణయం కూడా సఫలం కాలేదు. జీఎస్టీతో వ్యాపారులంతా దారుణంగా దెబ్బతిన్నారు. ఎప్పుడూ లేనివిధంగా మోడీ పాలనలో రూపాయి విలువ బాగా పతనమైంది. బీజేపీ ఆర్థిక విధానాలు దేశాన్ని తీవ్రంగా నష్టపరిచాయి. చివరికి రాఫెల్ స్కాం ద్వారా రక్షణ శాఖలో కూడా అవినీతికి పాల్పడిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆయన పాలనలో పెరిగింది అవినీతిపరులు తప్ప మరొకరు కారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి నిలువునా మోసం చేశారు. పెద్దనోట్ల రద్దు అన్నారు, ఏం జరిగింది? దేశంలో 2 శాతం వృద్ధి ఆగిపోయిందన్నారు.

మోడీ వచ్చిన తర్వాత 50 లక్షల ఉద్యోగాలు పోయాయి. దేశాన్ని అన్ని విధాలా దిగజార్చారు. సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో మనదేశం పదో స్థానంలో ఉందంటే మోడీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మోడీ పాలనలో మహిళలకు భద్రత లేదని అనేక ఘటనలు నిరూపించాయి. జమ్మూకాశ్మీర్ యువత తీవ్రవాదులుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా ఓట్లు కొంటున్నారు. హామీల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని ఎన్నడూ లేనంతగా దారుణమైన రీతిలో దుర్వినియోగం చేశారు. బీజేపీ, మోడీ ఓడిపోతేనే దేశానికి విముక్తి. ఇప్పుడు కర్ణాటకలో ఎన్డీయేకు ఎదురుగాలి వీస్తోంది. ఈ ప్రభంజనంలో బీజేపీ అభ్యర్థులకు ఓటమి తప్పదు. మోడీ తదితరులు ఎన్ని కుట్రలకు పాల్పడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీలో తిరుగులేని మెజారిటీతో అధికారం చేపట్టబోతున్నాం. దక్షిణ భారతదేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలే వస్తున్నాయి” అంటూ చంద్రబాబు జోస్యం చెప్పారు.