భారత వైమానిక దళం మిగ్ ఫ్లైట్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు బదిలీ చేశారు. భద్రతా కారణాల రీత్యా ఆయన్ను బదిలీ చేసినట్టు వారు ఓ ప్రకటనలో వెల్లడించారు.
ప్రస్తుతం అభినందన్ శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో ఇప్పటివరకూ విధులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే తాజాగా ఆయనను పశ్చిమ సెక్టార్‌కు భద్రతా కారణాల రీత్యా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.
గత కొన్ని వారాలుగా చికిత్స తీసుకుంటున్న అభినందన్ మళ్లీ విధుల్లోకి చేరనున్నారని ఐఏఎఫ్ అధికారులు చెబుతున్నారు. మరికొన్ని పరీక్షల అనంతరం అభినందన్ విధుల్లో చేరనున్నట్టు తెలుస్తోంది.
కాగా, పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌కు ప్రతీకారంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చి దాడి చేసేందుకు యత్నించాయి. ఈ దాడిని భారత వైమానిక దళం సమర్థంగా తిప్పికొట్టింది.
ఆ సమయంలో పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేసిన అభినందన్ వర్ధమాన్.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో పడిపోయి పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన విషయం తెల్సిందే. ఆ తర్వాత భారత్ తెచ్చిన దౌత్య ఒత్తిడి కారణంగా అభినందన్‌ను పాక్ ఆర్మీ వదిలిపెట్టింది.