సంతాన లేమికి కారణం ఇదే…

0
48

పురుషుల్లో సంతానోత్పత్తికి కీలకంగా వ్యవహరించేది ‘వై’ క్రోమోజోమ్. మారిన వాతావరణం, ఆహార పరిస్థితుల కారణంగా వై క్రోమోజోమ్‌ ఆకృతిలో మార్పులు జరుగుతున్నాయట. ఈ కారణంగా వీర్యం సరిపడనంత ఉత్పత్తి కాకుండా సంతానలేమి సమస్య ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే, పరిశోధనా ఆధారంగా చికిత్స తీసుకుంటే మాత్రం సంతాన భాగ్యం కలుగతుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మారుతున్న జీవన విధానం, పెరుగుతున్న దురలవాట్లు, మద్యపానం, జన్యువుల ప్రభావం, అనారోగ్య పరిస్థితుల వల్ల పురుషుల్లో వీర్యం తగ్గుతున్నట్టు వారు వెల్లడించారు. దీనివల్ల సంతానోత్పత్తి తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు జంటల్లో ఒక జంటకు సంతానోత్పత్తి సమస్య తలెత్తుతుందని చెప్పారు.

50 శాతం కేసుల్లో మగవారిలో లోపాలున్నట్లు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలెక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) సంస్థ పేర్కొంది. అనారోగ్య సమస్యలు, క్రానిక్‌హెల్త్ ప్రాబ్లమ్స్, జీవనశైలిలోతో పాటు జన్యు సంబంధమైన కారణాల వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గవచ్చని తెలిపింది.

సీసీఎంబీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ కె.తంగరాజ్ బృందం పరిశోధన చేసి ఈ విషయాలను స్పష్టం చేసింది. రెండు దశాబ్దాలుగా సంతానలేమి సమస్యపై శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.

శుక్రకణాల ఉత్పత్తికి కారణమైన ‘వై’ క్రోమోజోమ్ వివిధ రకాల ఆకృతులు సంతరించుకోవడం వల్ల సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుందని వారు వెల్లడించారు. పరిశోధనల్లో వందశాతం మందిలో 8.5 శాతం మందిలో కొన్ని జన్యువులు కనబడకుండా పోతున్నాయని తేలింది.

‘వై’ క్రోమోజోమ్‌లోని అజూస్పెర్మియా (ఏజడ్‌ఎఫ్) ప్రాంతంలో కొన్ని భాగాలు కనిపించడకపోవడం కూడా సంతానోత్పత్తి సమస్యకు కారణమవుతుందని పరిశోధనలో కనుగొన్నారు.

973 మంది లోపాలున్న పురుషులు, 587 మంది వీర్యం కౌంట్‌లో సమస్యలేని పురుషులకు వేర్వేరు పద్ధతులు, డీఎన్‌ఏ మార్కర్ల ద్వారా పరీక్షలు నిర్వహించగా 29.4 శాతం మందిలో క్రోమోజోమ్ ప్రాంతంలో భాగాలు లేకపోవడాన్ని గుర్తించారు.

చాలామంది పిల్లల కోసం సంతానసాఫల్య కేంద్రాలను ఆశ్రయించడం ఇటీవలి కాలంలో పెరిగింది. లక్షల రూపాయలు ఖర్చు చేసినా పిల్లలు పుట్టక పోవడంతో నిరాశకు లోనవుతున్నారని తెలిపారు. పిల్లలు పుట్టకపోవడానికి సరైన కారణాలు తెలియకపోవడంతో చికిత్స కూడా విఫలమయ్యేది.

తాజా పరిశోధన ఫలితాల్లో వై క్రోమోజోమ్ లోపాలను పరిక్షించుకొనే సదుపాయం కలుగనుంది. సరైన చికిత్సతో సంతానభాగ్యం పొందేందుకు మా పరిశోధన దోహదం చేస్తుందని డాక్టర్ తుంగరాజ్ తెలిపారు. పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి.

పరిశోధనలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్, ఇనిస్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్, సెంట్రల్ డ్రగ్ ఇనిస్టిట్యూట్ లక్నో, బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసి ప్రతినిధులు పాల్గొన్నారు.