జగన్ బాగా పరిణితి చెందాడు.. అది పనిచేసిందనీ అనుకోను : ఉండవల్లి

0
41

గతంతో పోల్చితే ఈ దఫా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిలో మంచి పరిణితి కనిపిస్తోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. అదేసమయంలో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం పని చేసిందా లేదా అన్నది తాను చెప్పలేనని తెలిపారు.

ఆయన తాజాగా మాట్లాడుతూ, ‘పసుపు-కుంకుమ’ కింద మహిళలకు పదివేల రూపాయలు చంద్రబాబు ఇచ్చారన్న ఫీలింగ్ వారిలో ఉంటే వాళ్లే కాదు వాళ్ల కుటుంబసభ్యులు కూడా టీడీపీకే ఓటు వేస్తారన్నారు. “పసుపు-కుంకుమ” ప్రభావం పని చేసిందా?లేదా? అనే ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేనని, అది తన స్థాయి కాదని చెప్పారు.

ఇకపోతే, 2014 నుంచి ఇప్పటి వరకూ చూస్తే జగన్‌లో ఇంప్రూవ్‌మెంటే ఉంది తప్ప, ‘డౌన్’ అయ్యేందుకు అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు విషయానికొస్తే, గతంలో టీడీపీకి మద్దతుగా ఉన్న బీజేపీ, జనసేన పార్టీలు ఈసారి లేవని, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే జగన్ పైచేయిలో ఉన్నాడని, చంద్రబాబు కింద ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

వీటన్నింటినీ మించి దేశంలో ఎక్కడా లేనట్టుగా ‘పసుపు-కుంకుమ’ కింద పది వేల రూపాయలు ఖాతాలో వేసి, మళ్లీ తామే అధికారంలోకొస్తే అదే మొత్తం వేస్తూనే ఉంటానని మహిళలకు చంద్రబాబు ఇచ్చిన హామీ వారిపై కచ్చితంగా పనిచేస్తుందని అనుకుంటున్నానని ఉండవల్లి చెప్పుకొచ్చారు.