బంతి రాహుల్ కోర్టులో ఉంది.. ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ : ప్రియాంకా గాంధీ

0
90

కాంగ్రెస్ పార్టీ తరుపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. ఇక ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీపై ఆమె పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆమె స్పందించారు.

కేరళలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పోటీ చేసిన వయనాడ్‌లో ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆదేశిస్తే వారణాసి నుంచి నేను సంతోషంగా పోటీచేస్తాను అని అన్నారు. ఈ అంశం రాహుల్ కోర్టులోనే ఉందని ఆమె చెప్పారు.

ప్రియాంకగాంధీ పోటీచేసే అంశాన్ని ఇటీవల మీడియా ప్రతినిధులు రాహుల్‌గాంధీ ఎదుట ప్రస్తావించగా.. సస్పెన్స్‌లో పెడుతున్నా అన్న సంగతి తెలిసిందే. గత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసిన అజయ్‌ రాయ్ మూడోస్థానానికి పరిమితమయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ కూడా ఈ స్థానం నుంచి పోటీచేసి రెండోస్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో మోడీ ఘన విజయం సాధించారు.

ఆయన ఈసారీ ఇదేస్థానం నుంచి పోటీచేస్తున్నారు. బీఎస్పీ-ఎస్పీ కూటమి తమ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీపై ప్రియాంక గాంధీ గతంలోనూ స్పందిస్తూ తమ పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమన్నారు. ఆమె ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీచేయాలని చాలామంది కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు.