ఈస్టర్ సండే పేలుళ్ళ పాల్పడింది మేమే : ఐసిస్

0
48

ఈస్టర్ సండే రోజున శ్రీలంక రాజధాని కొలంబో బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఈ పేలుళ్ళలో దాదాపు 350 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మారణహోమానికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది.

ఈ మేరకు ఐసిస్‌కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన చేసింది. కొలంబోలోని మూడు చర్చిలు, మూడు స్టార్ హోటల్స్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని పేర్కొంది. కాగా, కొలంబోలో పలుచోట్ల సంభవించిన పేలుళ్లలో 310 మంది వరకు మృతి చెందారు. ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు.

మరోవైపు, శ్రీలంకలో జరిగిన ఘోరకలి అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడులకు ముందే శ్రీలంకను భారత్ హెచ్చరించింది. కొలంబోలోని ఓ చర్చిలో తొలి దాడి జరగడానికి సరిగ్గా రెండుగంటల ముందు భారత నిఘా సంస్థ శ్రీలంక అధికారులతో తన వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంది. చర్చిలు, ఇతర ప్రార్థన స్థలాలపై దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినట్టు శ్రీలంక రక్షణ శాఖ వర్గాలు అంగీకరించాయి.

అంతేకాదు, అంతకుముందు రోజు రాత్రి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ భారత్ నుంచి సందేశాలు వచ్చినట్టు శ్రీలంక వర్గాలు తెలిపాయి. అయితే, భారత్ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో శ్రీలంక భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.