తెలంగాణాలో ఇంటర్ మార్కుల మంట… హైకోర్టు ఆగ్రహం

0
41

తెలంగాణలో ఇంటర్ బోర్డు చేసిన తప్పులతో ఆ రాష్ట్రం అగ్నిగుండంగా మారింది. ఓవైపు విద్యార్థులు, తల్లిదండ్రులు, మరోవైపు విపక్షాలు, విద్యార్థి సంఘాలు ఇంటర్ మార్కుల తప్పులతడకపై తీవ్ర ఆగ్రహావేశాలతో రోడ్డెక్కడంతో విషయం తీవ్రరూపం దాల్చింది.

అంతకుముందు ఇంటర్ మార్కుల వ్యవహారంపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సోమవారం తదుపరి విచారణ ఉంటుందని పేర్కొంది.

16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ఇంటర్ బోర్డు ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమని పిటిషనర్ తరఫు న్యాయవాది విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయవిచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ వేశామని అదనపు ఏజీ రామచంద్రరావు వివరణ ఇచ్చారు.

ఇదిలావుంటే, ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అక్కడకు భారీగా చేరుకుని మంగళవారం కూడా ఆందోళన నిర్వహించారు. ఇంటర్‌లో తమకు అన్యాయం చేశారని, రీ-వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకుందామంటే వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదంటూ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు స్పందించారు.

ఇంటర్‌ పేపర్‌ రీ-వెరిఫికేషన్‌, రీకౌంటింగ్‌కు మరో రెండు రోజులు గడువు పెంచారు. దీంతో పాటు సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా మరో రెండు రోజుల పాటు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 27వ తేదీ వరకూ గడువు పొడిగించినట్టు అధికారులు తెలిపారు.