నిస్సందేహంగా ఇది తమ వైఫల్యమే : శ్రీలంక ప్రభుత్వం

0
38

ఈస్టర్ సందర్భంగా జరిగిన నరమేధంపై 10 రోజుల ముందే సమాచారం ఉన్నా దాడులను అడ్డుకోలేకపోవడం పట్ల శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా చింతిస్తోంది. నిస్సందేహంగా ఇది తమ వైఫల్యమేనని అంగీకరించింది. ఈ మేరకు ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ ప్రతినిధి రజిత సేనరత్నే పేరిట ఆ ప్రకటన వెలువడింది.

“జరిగిన సంఘటనల పట్ల బాధపడుతున్నాం. నిఘా వర్గాల హెచ్చరికలు ఉన్నా తగిన రీతిలో స్పందించలేకపోయాం. బాధితుల కుటుంబాలకు, సంస్థలకు ప్రభుత్వం క్షమాపణలు తెలుపుకుంటోంది. బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించడంతోపాటు దెబ్బతిన్న చర్చిల పునర్నిర్మాణం బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే స్వీకరిస్తుంది” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు, మృతుల సంఖ్య మంగళవారానికి 321కి పెరిగింది. కనీసం 45 మంది చిన్నారులు బలయ్యారని, ఇందులో ఐదుగురు విదేశీయులని యునిసెఫ్ తెలిపింది. వారిలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఎనిమిదేండ్ల వయస్సు గల బంధువు ఉన్నారు. అతడు అధికార అవామీ లీగ్ నేత షేక్ ఫాజ్లుల్ మనుమడు జయాన్ చౌదరి అని తెలిపారు.

సెయింట్ సెబాస్టియన్ చర్చిలో 17 మంది, జోయి చర్చిలో 13 మంది, మిగతావారు ఇతర పేలుళ్లలో మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారని వెల్లడించింది. మరోవైపు మృతిచెందిన భారతీయ పౌరుల సంఖ్య 10కి పెరిగింది. కర్ణాటకకు చెందిన ఏ.మరేగౌడ, హెచ్ పుట్టరాజు మృతదేహాలను గుర్తించామని భారత హై కమిషన్ మంగళవారం ట్వీట్ చేసింది. వారిద్దరూ జేడీఎస్ వారేనని కర్ణాటక సీఎం కుమారస్వామి తెలిపారు.