తాను ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై పార్టీ నిర్ణయమే అంతిమమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో చెప్పానని, మళ్లీ ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు.
ఆమె తన తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, అందుకే మార్పును కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను చాలా చోట్ల తిరిగాను. చాలా మంది ప్రజలను కలిశాను. ఎక్కడికెళ్లినా నరేంద్ర మోడీపై తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ప్రజలు తమ వ్యతిరేకతను, కోపాన్ని ఓట్ల రూపంలో చూపిస్తారన్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాకాం గాంధీ పోటీ చేస్తారా? లేదా? ఒకవేళ పోటీ చేస్తే వారణాసి నుంచేనా? అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.