అసలు నిజం కంటే అపోహలు ఎక్కువ : తెలంగాణ విద్యామంత్రి

0
40
Jagadeshwar Reddy
Jagadeshwar Reddy

తెలంగాణ ఇంటర్ బోర్డు వెల్లడించిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆ రాష్ట్ర విద్యామంత్రి జి.జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని, త్రిసభ్య కమిటీ నివేదిక అందగానే నిందితులుగా తేలితే ఎంతటివారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యార్థులు, తల్లిదండ్రులు అపోహలకుపోయి ఆందోళన చెందవద్దన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నాయన్నారు. అసలు నిజం కంటే అపోహలు ఎక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు.

ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీ వేగవంతంగా పనిచేస్తున్నదని, నివేదిక అందగానే సాంకేతిక లోపమైతే ఆ సంస్థపైన, మానవ తప్పిదమైతే సంబంధిత అధికారులపైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

కొందరు దీనిని రాజకీయంచేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని, కమిటీ నివేదిక అందకుండానే తమ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

అనుమానం ఉన్న వారు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కరించుకోవాలి తప్ప అపోహలకు పోయి తమ విలువైన జీవితాలను వృథా చేసుకోవద్దని సూచించారు.