తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల వెల్లడైన ఇంటర్మీడియ్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా వివాదాన్ని సృష్టించాయి. అనేక మంది టాపర్స్ విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. విచిత్రమేమిటంటే అనేక మందికి సున్నా మార్కులు వచ్చాయి. దీంతో 15 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం అగ్ని గుండంగా మారింది.
దీనిపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టిసారించారు. విద్యాశాఖ అధికారులతో పాటు.. సీఎస్‌తో సమీక్ష నిర్వహించారు. ‘పదో తరగతి పాసైన విద్యార్థులు.. ఇంటర్మీడియట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వారికి సున్నా మార్కులు రావడం ఏంటి’ అని గవర్నర్ నరసింహన్ అధికారులను ప్రశ్నించారు. ‘ఎన్నడూ లేనట్టు ఇంటర్ ఫలితాలపై వివాదం ఎందుకు? ఇంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేంటి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్ విద్యార్థుల ఆందోళనలతో తాజా పరిస్థితిపై నివేదించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దాంతో బుధవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
విద్యార్థులకు పలు సబ్జెక్టుల్లో సున్నా మార్కులు రావడానికి కారణమేంటని అడిగారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకొని, పకడ్బందీగా నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, ఇంటర్ బోర్డు విశ్వసనీయత పెంచేలా చర్యలు ఉండాలని ఆదేశించారు. 3.2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, వీరి జవాబు పత్రాల రీ-వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఉచితంగా చేయాలని సీఎం ఆదేశించారని అధికారులు తెలిపారు.
తొలుత సెకండియర్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్ణీత వ్యవధిలో వెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియలు పూర్తిచేయాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి మానవ తప్పిదంతో నష్టపోకుండా చూడాలని గవర్నర్ స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆత్మహత్యలు, ఆందోళనలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.