437 సీట్లలో బీజేపీ పోటీ… అయినా కనబడని హవా.. వాడిపోతున్న కమలం

0
87

ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మొత్తం 437 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ చరిత్రలో ఇంతమంది అభ్యర్థులను పోటీలో నిలపడం ఇదే ప్రథమం. కాంగ్రెస్‌ అభ్యర్థుల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులను కమలం పార్టీ పోటీలో నిలపడం విశేషం.

గత 2014 ఎన్నికల్లో 427 సీట్లలో బీజేపీ పోటీ చేయగా కాంగ్రెస్‌ 450 సీట్లలో పోటీ చేసింది. అయితే కాంగ్రెస్‌ ఈసారి బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీ చేస్తోంది. 2014తో పోలిస్తే ఈసారి ఎక్కువ పార్టీలతో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకుంది. నరేంద్ర మోడీని ప్రధానికాకుండా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం అనేక రాష్ట్రాల్లో తన సీట్లను ప్రాంతీయ పార్టీలకు త్యాగం చేసింది.

మరోవైపు, గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ… మూడో దశ పోలింగ్‌‌లో బీజేపీ కొంత పుంజుకున్నట్లు కనపడినా మొత్తం మూడు దశల పోలింగ్‌లో మాత్రం భారీగానే నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

మొత్తం పోలింగ్‌ జరిగిన 117 స్థానాల్లో ఎన్డీయే 30కి పైగా సీట్లను, యూపీఏ 55 స్థానాలు, దాదాపు 15పై చిలుకు స్థానాలు తటస్థ పార్టీలకు దక్కవచ్చని లెక్కలు వేస్తున్నారు.

ఇదిలావుంటే, గుజరాత్‌లో బీజేపీ దాదాపు 6 నుంచి 8 స్థానాలు కోల్పోవచ్చని, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో గతంలో వచ్చినన్నిసీట్లు రావని అంచనా. ఈ రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, మతతత్వం వంటి సమస్యలతో పాటు స్థానిక కారణాలు ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేసినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

అదేసమయంలో 2014లో మోడీ హవా కొనసాగింది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఇది బాగా పని చేసింది. ఫలితంగా బీజేపీ ఒక్కటే ఏకంగా 272 సీట్లకు పైగా గెలుచుకుంది. ఇపుడు ఈ హవా లేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ఈ విషయం ముగిసిన మూడు దశల పోలింగ్ నిరూపించింది కూడా. దీంతో యూపీఏ భాగస్వామ్య పార్టీలు మిగిలిన నాలుగు దశల్లో పకడ్బంధీగా ముందుకు సాగాలని భావిస్తున్నాయి.