ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఎలాంటి అధికారులులేని సీఎం అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, కొందరు కలెక్టర్లు, అధికారులు ఎన్నికల కమిషన్‌కు సహకరించడంలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎల్వీ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే, సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తన సహాయం కోరారన్నారు. ఈ నేపథ్యంలోనే బ్యూరోక్రాట్‌లకు ‘బాస్’గా తాను ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు, స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రతపై కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు వివరణ ఇచ్చారు.
ఇందులో తప్పేమీ లేదని, నిబంధనలకు లోబడే వ్యవహరించానని సమర్థించుకున్నారు. సీఈవో ద్వివేదితో కలిసి ఈ సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న పునేఠా స్థానంలో ఎన్నికల కమిషన్ ఎల్వీ సుబ్రమణ్యంను నియమించిన సంగతి తెలిసిందే.
కాగా, ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ చీఫ్ మినిస్టర్‌కు ఉన్న అధికారాలు ఉండవు. ఆయన తన ఇష్టానుసారం సమీక్షలు నిర్వహించజాలరు’ అని ఎల్వీ తెలిపారు. సాంకేతికంగా చూస్తే చంద్రబాబు ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’ కాదని, ముఖ్యమంత్రేనని చెప్పారు. ‘చంద్రబాబు ముఖ్యమంత్రే! కానీ, అధికారాలు లేని ముఖ్యమంత్రి’ అని తేల్చేశారు. ‘మళ్లీ గెలవలేకపోతే మే 23వ తేదీన చంద్రబాబు దిగిపోతారు’ అని తెలిపారు. ఏ పార్టీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా ఆయనే చెప్పేశారు. ‘‘టీడీపీ గెలిస్తే చంద్రబాబు, లేకపోతే వైసీపీ అధ్యక్షుడు జగన్ మంచి ముహూర్తం చేసుకుని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు సీఎం అయినప్పటికీ అధికార యంత్రాంగం వారికి సహకరిస్తుంది’’ అని తెలిపారు.