శ్రీలంకలో ఉగ్ర తండాగా మారిన సంపన్న కుటుంబం

0
57

ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులు ఓ సంపన్న కుటుంబానికి చెందిన పౌరులే కావడం గమనార్హం. వీరి తండ్రి శ్రీలంకలో దిగ్గజ మసాలా వ్యాపారిగా పేరున్నారు. ఈయన పేరు మహమ్మద్‌ యూసఫ్‌ ఇబ్రహీం. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

అతడు తన కుమారులు ఇల్హమ్‌ అహ్మద్‌ ఇబ్రహీం, ఇమ్సత్‌ అహ్మద్‌ ఇబ్రహీంలను ఆత్మాహుతి దాడులకు ప్రొత్సహించడమే కాకుండా.. ఆర్థిక సాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ వ్యాపారి ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఆయన కోడలు కూడా తనను తాను పేల్చుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు.

మరోవైపు, శ్రీలంకలో ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట సాగుతోంది. బుధవారం అర్థరాత్రి ఆర్మీని రంగంలోకి దించారు. లంక సీఐడీ, ఉగ్రవాద విచారణ విభాగాలు గురువారం ఆర్మీసాయంతో ఐదుచోట్ల దాడులు నిర్వహించాయి. 16 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. వీరితో కలిసి ఇప్పటివరకూ పోలీస్‌ కస్టడీలో ఉన్న వారి సంఖ్య 76కు చేరింది. కాగా, పేలుళ్లకు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం తన పదవికి రాజీనామా చేశారు.