ముఖ్యమంత్రికి అధికారాలు లేవా? ఎల్వీకి సీఎం చంద్రబాబు లేఖ

0
57

ముఖ్యమంత్రికి ఎలాంటి అధికారాలు లేవని కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.

ఒక ఆంగ్ల పత్రికలో ప్రముఖంగా ప్రచురితమైన ఆ వార్తా కథనాన్ని కూడా తన లేఖకు జత చేశారు. ‘ఒక ముఖ్యమంత్రి పట్ల మీరు వాడిన భాష అభ్యంతరకంగా ఉంది. అఖిల భారత సర్వీసు అధికారుల ప్రవర్తనా నియమావళిని కూడా ఉల్లంఘించినట్లుగా ఉంది. మీరు హుందా, గౌరవాన్ని పాటించలేదు. ఈ వార్తలో ప్రచురితమైనట్లుగా ఉన్న వ్యాఖ్యలు మీరు చేశారా! దీనిపై మీ వివరణ ఏమిటి?’ అని ఎల్వీ సుబ్రమణ్యంను ముఖ్యమంత్రి చంద్రబాబు తన లేఖలో ప్రశ్నించారు.

అదేసమయంలో రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని, ఎన్నికల ఫలితాలు వెల్లడికాలేదన్న సాకు చూపుతూ ఈసీ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి 9 పేజీల లేఖను రాసిన ఆయన, పలు విషయాలను ప్రస్తావించారు. ఈ వేసవిలో ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న పనులను ఈసీ అడ్డుకుంటోందని ఆరోపించారు.

తాగునీటి సమస్య, పోలవరం, రాజధాని నిర్మాణం తదితరాలపై ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునేలా ఆంక్షలు పెట్టవద్దని తన లేఖలో చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రాజెక్టులపై సమీక్షలను అడ్డుకోవద్దని కూడా విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ప్రభుత్వానికి శాఖల సమీక్ష చేసే హక్కు ఉందని పేర్కొన్న చంద్రబాబు, ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని విమర్శించారు.