పాకిస్థాన్‌పై అగ్రరాజ్యం అమెరికా కన్నెర్రజేసింది. వివిధ రకాల ఆంక్షలు విధించింది. అమెరికా నుంచి బహిష్కరణకుగురైన పాక్ జాతీయులు, వీసా గడువు ముగిసినా ఇంకా అమెరికాలో ఉంటున్న పాకిస్థానీయులను స్వదేశానికి రప్పించేందుకు పాక్ నిరాకరించడంతో అమెరికా ఈ తరహా కఠిన నిర్ణయం తీసుకుంది.
ఇదే అంశంపై అమెరికా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ‘పాక్‌తో దౌత్య సంబంధ విషయాల్లో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు. కానీ, ఆంక్షలు విధిస్తున్నట్లు ఫెడరల్ రిజిస్ట్రార్ ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని వల్ల పాకిస్థానీయులకు వీసాల మంజూరు ప్రక్రియను ప్రస్తుతానికి నిలిపివేయవచ్చు’ అని ఓ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
అమెరికా ఆంక్షలు విధించిన పది దేశాల జాబితాలోకి పాకిస్థాన్ కూడా చేరింది. అమెరికా న్యాయ నిబంధనల ప్రకారం ఆయా దేశాలు దేశబహిష్కృతులను, వీసా గడువు ముగిసిన వారిని వెనక్కి తీసుకెళ్లడానికి నిరాకరిస్తున్నాయి. ఇప్పటికే గయానా(2001), గాంబియా(2016), కంబోడియా, ఎరిట్రియా, గునియా, సియెర్రా లియోన్(2017), బర్మా, లావోస్(2018) దేశాలపై ట్రంప్ ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతుండగా, ఈ ఏడాది ఘనా, పాకిస్థాన్ వచ్చి చేరాయి.