అక్కడకు వెళ్లాక రాజకీయాలకు పనికిరానని తెలిసొచ్చింది : బండ్ల గణేష్

0
44

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్నచిన్న వేషాలు వేసుకుంటూ గుర్తింపు పొంది బడా నిర్మాత స్థాయికి ఎదిగిన నటుడు బండ్ల గణేష్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వంటి అనేక మంది హీరోలతో చిత్రాలు నిర్మించారు. పవన్ గబ్బర్ చిత్రానికి, అల్లు అర్జున్ బద్రీనాథ్ చిత్రానికి ఈయనే నిర్మాత.

అయితే, ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో హడావుడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ ఉన్నట్టుండి క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యాడు.

అయితే ఆయన క్రియాశీలక రాజకీయాలకు గుడ్‌‌బై చెప్పినప్పిటికీ రెండు కోరికలు మాత్రం ఉన్నాయట. ఈ విషయాన్ని స్వయాన ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆ రెండు కోరికలు ఏంటి..? ఇంతకీ ఆ కోరికలు రెండు నెరవేరతాయా..? లేదా..? అనేదానిపై కూడా ఆయనే వివరణ ఇచ్చాడుకూడా.

ఆయన వివరణ ఆయన మాటల్లోనే.. ‘నేను రాజకీయాలకు పనికిరానని ఎన్నికలకు ముందే తెలిసివచ్చింది. కానీ, అపుడే గుడ్‌బై చెప్పడం బాగోలేదని భావించి పార్టీలో కొనసాగాను. పైగా, రాజకీయాల్లో యాక్టింగ్ పనికిరాదని అర్థమైంది. అయితే, నాకు రెండు కోరికలు ఉన్నాయి. అందులో ఒకటి.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగాను, రెండోది జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే. ఈ రెండూ కూడా నెరవేరుతాయని నాకు గట్టిగా నమ్మకం ఉంది. టైమ్ తేడా ఏముందిలే గానీ.. టైమింగ్ మాత్రం తేడా ఉండదు.

రాజకీయాల్లో చేరకముందు కొందరు నన్ను ‘మీరు సూపర్ స్టార్, మెగాస్టార్’ అంటూ మునగ చెట్టు ఎక్కించారు. ఈ విషయాన్ని ఆరంభ దశలో గ్రహించలేక పోయాను. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనం ఏ స్టార్ కాదని తెలిసొచ్చింది” అని బండ్ల గణేష్ వివరించారు. అయితే గణేష్‌కు ఉన్న ఆ రెండు కోరికలు నెరవేరతాయో..? లేదో..? ఒకవేళ నెరవేరితే ఎప్పుడు ఈ రెండు జరుగుతాయో..? వేచి చూడాల్సిందే మరి.