బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సభా వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. మహరాష్ట్రలోని షిర్డి లోక్‌సభ స్థానంలో శివసేన అభ్యర్థి సదాశివ్ లోకండేకు మద్దతుగా ప్రచారం చేస్తుండగా ఈ ఘటన జరిగింది.
ఈ సమావేశంలో ఆయన ప్రసంగాన్ని పూర్తి చేసుకొని, తన స్థానానికి వెళ్లే క్రమంలో వేదికపై ఒక్కసారిగా కూలిపోయారు. వెంటనే అతడి భద్రతా సిబ్బంది, వేదికపై ఉన్న అహ్మద్‌నగర్ భాజపా అభ్యర్థి సుజయ్ విఖే పాటిల్, మహరాష్ట్ర మంత్రి రామ్ షిండే అప్రమత్తమై గడ్కరీకి సహాయపడ్డారు.
కొద్దిసేపటికే గడ్కరీ తేరుకొని తన కారు వరకు నడిచి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. గడ్కరీ ఇంతకుముందు కూడా స్పృహ తప్పి పడిపోయిన సందర్భాలున్నాయి. గత సంవత్సరం డిసెంబరు 7న మహరాష్ట్రలోని రాహురీ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఆ సమావేశంలో స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఎన్నికల్లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా గడ్కరీ పోటీ చేస్తున్నారు.