నేడు నాలుగో విడత ఎన్నికలు : ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభం

0
48

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం నాలుగో విడత పోలింగ్‌ ప్రారంభమైంది. 9 రాష్ట్రాల్లో సోమవారం పోలింగ్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర (17), ఉత్తరప్రదేశ్ (13), రాజస్థాన్ (13), పశ్చిమ బెంగాల్ (8), మధ్యప్రదేశ్ (6), ఒడిశా (6), బీహార్ (5), ఝార్ఖండ్ (3), జమ్మూకాశ్మీర్ (1) రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో పోలింగ్ సాగుతోంది.

12.79 కోట్ల మంది ఓటర్లు 961 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశిస్తారు. 1.40 లక్షల పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. కాగా, నాలుగో దశ నుంచి చివరిదైన ఏడో దశ పోలింగ్ వరకు ఇకమీదట జరిగే ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకం కానున్నాయి. ఏప్రిల్ 29 నుంచి మే 19 వరకు జరిగే వివిధ దశల పోలింగ్‌లో మొత్తం 239 స్థానాలకు ఓటింగ్ జరగనుంది.

2014 ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా 282 స్థానాలు గెలుచుకోగా, వాటిలో 183 స్థానాలు ఈ నాలుగు దశల్లో ఎన్నికలు జరుపుకుంటున్న రాష్ట్రాల నుంచే దక్కాయి. మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి మిగిలిన ఈ నాలుగు దశలే ప్రాణాధారం కానున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈసారి బీజేపీ ఆధిపత్యానికి గండికొట్టాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది.

నాలుగో విడతలో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, సుభాష్ బాంబ్రే, ఎస్‌ఎస్ అహ్లూవాలియా, బాబుల్ సుప్రియో, బైజయంత్ పండా (బీజేపీ), మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, అధిర్ రంజన్ చౌధురి, ఊర్మిలా మతోండ్కర్, మిలింద్ దేవ్‌రా (కాంగ్రెస్), కన్హయ్య కుమార్ (సీపీఐ), డింపుల్ యాదవ్ (ఎస్పీ), శతాబ్దిరాయ్ (తృణమూల్) వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల కోసం 2.7 లక్షలకు పైగా పారామిలటరీ బలగాలు, 20 లక్షలకు పైగా రాష్ట్ర పోలీసు సిబ్బందిని మోహరించినట్లు కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. ఇంత భారీగా భద్రతా సిబ్బందిని మోహరించడం ఇదే తొలిసారి అని చెప్పారు. ఎన్నికల సంఘం సిఫారసుల మేరకు 2,760 కంపెనీల పారామిలటరీ బలగాలను ఎన్నికల విధులకు పంపామన్నారు.

వీరితో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీస్, హోంగార్డులు 20 లక్షల మందికి పైగా వినియోగిస్తున్నట్లు చెప్పారు. భద్రతాపరంగా అత్యంత సున్నిత రాష్ట్రం జమ్ము కశ్మీర్‌ను పక్కనబెడితే, పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 41 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించారు.