పోలింగ్‌కు ముందు ఇచ్చే రూ.2 వేల నోటు గుర్తుంటుంది : జేసీ దివాకర్

0
52

ఐదేళ్ల పాటు అధికారంలో ఉండే ప్రభుత్వం.. ఎన్నో సంక్షేమ పథకాలు చేసినా గుర్తు పెట్టుకోరనీ, కానీ పోలింగ్‌కు ముందు ఇచ్చే రూ.2 వేల నోటు మాత్రమే వారికి గుర్తుండిపోతుందని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం నేతల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైవుంది. ఆ ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లో మూడంచెల భద్రత మధ్య ఉన్నాయి. అవన్నీ మే 23వ తేదీన తెరుచుకోనున్నాయి. ఆ రోజు ఎవరు అసెంబ్లీ, పార్లమెంట్‌కు వెళ్తారో.. ఎవరు ఇంటి బాట పడతారో అనేది తేలిపోనుంది.

మరోవైపు అటు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు సైతం సర్వేల మీద సర్వేలు ఇస్తున్నాయి. అయితే.. ఏపీలో ఎవరు గెలుస్తారన్నది తాజాగా అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చెప్పేశారు. ఫలితాలు రాక ముందే మేం చేతులు ఎత్తేయట్లేదని.. ఖచ్చితంగా చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారని జేసీ జోస్యం చెప్పారు.

టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయన్నది మాత్రం తనకు తెలియదన్నారు. సీట్లు లెక్కలేసే అంత మేధావిని మాత్రం తాను కాదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ప్రజలు ఐదేళ్ల పాటు ఎంత చేసినా గుర్తుండదు.. కానీ చివర్లో ఓటుకు ఇచ్చే రెండు వేల రూపాయిలు మాత్రం గుర్తుంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టని సంక్షేమ పథకాలను చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టింది. సుమారు 120 పథకాలకు పైగా ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు.

ఐదేళ్లు ఎంత చేసినా ప్రజలకు ఏమీ గుర్తుండదు.. ఎన్నికల ముందు రోజు చేసింది మాత్రమే గుర్తుండిపోతుంది.. అదే రెండు వేలు. చంద్రబాబు వందకు వంద శాతం మళ్లీ సీఎం అవుతారు అని జేసీ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా, ఆయన కుమారుడుని బరిలోకి దించిన విషయం తెల్సిందే.