రోజులు గడుస్తున్నా ఇంటర్ బోర్డు దగ్గర పరిస్ధితి మారడం లేదు. సోమవారం అఖిలపక్షం ధర్నా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీ నాయకులను ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇంటర్ బోర్డు ముట్టడికి బయలుదేరిన నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరామ్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.
అలాగే విద్యార్ధులు రోడ్లపై ఆందోళనకు దిగడం పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది. మృతిచెందిన విద్యార్థులకు పరిహారం ప్రకటించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటర్ బోర్డ్ ఎదుట సోమవారం కూడా విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్ధులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట చోటుచేసుకుంది. నడిరోడ్డుపైనే విద్యార్ధులను ఇష్టానుసారం లాగేసిన పోలీసులు బలవంతంగా వ్యాన్లలో తరలించారు.