ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టు “ఆర్ఆర్ఆర్”. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‍లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభంకాగా, ఈ షూటింగ్‌లో హీరోలిద్దరూ గాయపడ్డారు కూడా.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన హీరోయిన్‌ల విషయం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చే ఈ చిత్రాన్ని ట్రెండింగ్‌లో నిలుపుతోంది. రామ్ చరణ్‌కు అలియా భట్‌ను ఎంపిక చేసిన రాజమౌళి, ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్‌ని దించగా, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ కోసం హీరోయిన్‌ను వెతికే వేటలో ఉంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.
సల్మాన్ ఖాన్ సిఫార్సుతో జాక్వలిన్‌ను ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా తీసుకున్నారనే వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు. ఇక ఎన్టీఆర్ రోల్‌కు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఓ గిరిజన యువతి ఎన్టీఆర్‌ను ప్రేమిస్తుందనే వార్తలు ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో హల్‌చల్ చేస్తున్నాయి.
అంతేకాదు గిరిజన యువతిగా నిత్యామీనన్ నటించనుందని అంటున్నారు. మరి ఇలాంటి వార్తలన్నింటికీ క్లారిటీ రావాలంటే మరోసారి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రెస్‌మీట్ పెట్టాల్సిందే. అప్పటివరకు సినీ ప్రేక్షకులు వేచిఉండాల్సిందే.