వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రం ఒక్క ఏపీలో మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఏపీలో మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు రాష్ట్ర హైకోర్టు సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఈ చిత్రం వివరాలను మీడియాకు వెల్లడించేందుకు ఆర్జీవీ ఆదివారం విజయవాడలో ప్రెస్‌మీట్ ఏర్పాటుకు ప్రయత్నించారు.
అయితే, ఆర్జీవీతో పాటు.. చిత్ర బృందాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. సుమారు 7 గంటల హైడ్రామా మధ్య దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ, నిర్మాత రాకేశ్ రెడ్డితో పాటు చిత్రబృందాన్ని బలవంతంగా ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్‌కు పంపించేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై నేను న్యాయపరంగా చర్యలు తీసుకుంటాను. పోలీసులు అసలు ఎందుకు ఆపారో..? మేం ఎలాంటి నేరం చేయలేదు. మా మీద ఎలాంటి చార్జ్ షీట్ కూడా లేదు. అలాంటప్పుడు పోలీసులకు మమ్మల్ని ఆపే హక్కు ఎవరిచ్చారు?. పోలీసులు చెబుతున్నట్లుగా శాంతి భద్రతలు అనేవి రోడ్డు మీద ఉండొచ్చు కానీ.. రూమ్‌లో ఎలా ఉంటాయి. మీరు ప్రెస్‌మీట్ పెట్టుకోవడానికి వీలు లేదని చెప్పచ్చు కానీ.. విజయవాడలో ఉండటానికి వీల్లేదు.. లోపలికి రావడానికి వీల్లేదు.. అని ఎలా చెబుతారు.
అసలెందుకిలా చేస్తున్నారని పోలీసులను పదే పదే అడిగినప్పటికీ నాకు సమాధానం చెప్పలేదు. మా ఉన్నతాధికారులు చెప్పినట్లే మేం చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారే తప్ప నేను అడిగిన ప్రశ్నలకు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. పోలీసుల నాకు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.. ఏడు గంటలపాటు కనీసం మాట్లాడలేదు’ అని మీడియాకు వివరించారు. ఆర్జీవీ వ్యాఖ్యలపై విజయవాడ పోలీసుల స్పందన ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.